2015 సింహ రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...
మఘ 1, 2, 3, 4 పాదములు (మా, మీ, మూ, మే)
పుబ్బ 1, 2, 3, 4 పాదములు (మో, టా, టీ, టు)
ఉత్తర 1వ పాదం (టే)
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5
సింహ రాశివారికి జూలై 14 వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు ఈ సంవత్సరము అంతా ద్వితీయము రాహువు, అష్టమము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు శని సంచరిస్తారు. అర్థాష్టమ శనిదోషం ఏర్పడింది.
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'సాహస విధధీ తన క్రియం' అన్నట్లుగా తమ తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల అవమానాలు, అపవాదులు కుటుంబీకుల మధ్య అకారణంగా కలహాలు వచ్చే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించడి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహించడం మంచిది. నిరుద్యోగులు అధైర్యాన్ని వీడి ముందుకు సాగిన సత్ఫలితాలు పొందుతారు. గృహ నిర్మాణం లేదా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ఒకడుగు ముందుకు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.
అస్థిరబుద్ధి కారణంగా నిర్ణయాల్ని తరచూ మారుస్తుంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. విద్యార్థులతో నూతన ఉత్సాహం నెలకొంటుంది. బంగారం వెండి, లోహ వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సిమెంటు, కలప, ఇటుక, వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి స్త్రీ మూలక సమస్యలు తలెత్తవచ్చు. అపరాలు, ధాన్యం, స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. భాగస్వాముల మధ్య అవగాహన లోపం అధికమవుతుంది. మతపరమైన ఇష్టాగోష్టిలో పాల్గొనడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. సినిమా, పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు తలెత్తుతాయి. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. వైద్య రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది.
కళ, క్రీడ, రచన, మీడియా రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకున్నంత అభివృద్ధి ఉండజాలదు. ఎదుటివారి ప్రభావానికి లోనవుతారు. ఆడిటర్లకు అవరోధాలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు ప్రతి పని చేతిదాకా వచ్చి తప్పిపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రాజకీయాల్లో వారు వేసే పథకాలు వికటించడం వల్ల అశాంతికి లోనవుతారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లోవారికి రావలసిన బకాయిలు సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు.
ఈ రాశివారు ప్రతిరోజూ లలితా సహస్రనామం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వల్ల లేదా చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. విద్యార్థులు విద్యాభివృద్ధికి మహాగణపతిని పూజించడం వల్ల విద్యాభివృద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
ఈ రాశివారికి అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఈ క్రింది శ్లోకాన్ని ప్రతిరోజూ ఉత్తరముఖంగా తిరిగి 9 సార్లు పఠించిన సర్వదోషాలు తొలగిపోతాయి.
"ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్"
** మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు మొదుగ చెట్టును, ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టును దేవాలయాలలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటి ఈ చెట్ల అభివృద్ధికి దోహదపడండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
మఖ నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పుబ్బ నక్షత్రం వారు వజ్రాన్ని, ఉత్తర నక్షత్రం వారు జాతికెంపు లేక పుచ్చకెంపు లేక స్టార్‌రూబి అనే రాయిని ధరించినా సర్వదా శుభం కలుగుతుంది.
