బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జనవరి 2025 (22:42 IST)

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

sandhya theater
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కి నోటీసులు జారీచేసింది. పైగా, ఈ ఘటనపై సీనియర్ ర్యాంకు పోలీస్ అధికారితో విచారణ జరపాలని సూచన చేసింది. పైగా, ఈ మొత్తం అంశంపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 
 
డిసెంబరు 4వ తేదీన అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' ప్రీమియర్‌ షోను సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షోను తిలకించేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ప్రీమియర్‌ షోకి అల్లు అర్జున్‌ రావడం, పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందిందని, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషన్‌ సంధ్య థియేటర్‌ ఘటనపై సీనియర్‌ ర్యాంక్‌ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.