శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:58 IST)

వణికిపోతున్న బాలీవుడ్ హీరోయిన్లు.. ఫోన్లు తీసుకున్న ఎన్సీబీ!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైన హీరోయిన్లతో పాటు.. ఇప్పటివరకు విచారణకు హాజరుకాని సినీ సెలెబ్రిటీలు సైతం వణికిపోతున్నారు. ముఖ్యంగా, ఈ విచారణకు హాజరై వచ్చిన హీరోయిన్లు రకుల్ ప్రీత్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు కంటిమీద కునుకులేకుండాపోయింది. విచారణకు హాజరైన ఈ హీరోయిన్లు ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్సీబీ అధికారులు.. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారి వెన్నులో వణుకు మొదలైంది. 
 
కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తి డ్రగ్స్ గుట్టంతా ఎన్సీబీ అధికారులకు చెప్పారు. దీంతో వరుసగా హీరోయిన్లకు సమన్లు పంపి విచారిస్తున్న మహారాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, మొత్తం డ్రగ్స్ దందాకు దీపికా పదుకొనే మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సాక్ష్యాలు సంపాదించారని తెలుస్తోంది. 
 
ఆమె అడ్మిన్‌గా ఉన్న వాట్స్ యాప్ గ్రూప్‌లోనే చాటింగ్ అంతా జరిగిందని నిర్ణయానికి వచ్చిన అధికారులు, శనివారం నాటి విచారణలో ఆమెకు క్లీన్‌చిట్ ఇవ్వకపోగా, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, మరోసారి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
 
అదేసమయంలో అంతకుముందు విచారించిన నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌ల స్మార్ట్ ఫోన్లను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ అనంతరం బయటకు వచ్చే సమయంలో వీరికి ఇవ్వలేదు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని మరింతగా విశ్లేషించేందుకు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఇక టాలెంట్ మేనేజర్ జయా సాహా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా, తదితర తాము విచారించిన ఎవరి ఫోన్లనూ వెనక్కు ఇవ్వలేదని ఎన్సీబీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న ఎల్విన్ గెస్ట్‌హౌస్‌ను వేదికగా చేసుకుని విచారణ ప్రారంభించిన నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, సుశాంత్ అత్మహత్య తర్వాత, అతని ప్రియురాలు రియాతో మొదలు పెట్టి, పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.