శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (13:07 IST)

కంగ్రాట్స్ జగనన్నా.. యాత్ర-2కి రంగం సిద్ధం.. హ్యాష్ ట్యాగ్ జత చేశారుగా..

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన 14 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి 28 కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అనే చెప్పుకోవాలి. ఆయన సహజ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ యాత్ర 2కి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మహి. వి రాఘవ్‌ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు.
 
జగన్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. "కంగ్రాట్స్‌ జగన్‌ అన్నా. ఈ విజయానికి నువ్వు అర్హుడివే. నువ్వు హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌ ప్రజల కోసం చేసిన కృషి కంటే ఎక్కువగా కష్టపడతావని ఆశిస్తున్నాం. ప్రజలకు చెప్పి తీరాల్సిన విజయం నీది'' అని పేర్కొంటూ పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా యాత్ర-2 అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 
 
నిర్మాత శివ మేకను కూడా ట్యాగ్‌ చేశారు. దీనిని బట్టి చూస్తే రాఘవ్‌ ‘యాత్ర 2’కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, వైఎస్సార్‌ కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ తన తండ్రి మార్గాన్నే ఎంచుకుని ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు.