సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (20:00 IST)

కొత్త‌వారైనా అల‌రించే దిశ‌గా మైల్స్ ఆఫ్ లవ్ - రివ్యూ

Miles of Love
తారాగణం వివరాలుః అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి,  రవితేజ పైలా, రేవతినాడ, 
 
సాంకేతిక‌తః సినిమాటోగ్రఫీ - రవి మణి కె నాయుడు, ఎడిటర్ - బి నాగేశ్వర్ రెడ్డి, సంగీత దర్శకుడు - ఆర్ఆర్ ధృవన్, నిర్మాత - వెంకట రాజి రెడ్డి కాంతాల, క‌థ‌, దర్శక‌త్వంః నందన్
 
కొత్త నటీనటులతో ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన‌ సినిమాగా `మైల్స్ ఆఫ్ లవ్`. టైటిల్‌లోనే జర్నీ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ అని తెలిసిపోతుంది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా క‌థ‌లు వ‌చ్చినా తాజాగా  అక్టోబర్ 29న రెండు పెద్ద చిత్రాలతో విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
నీలాంభరి (రమ్య పసుపులేటి) సినిమా దర్శకురాలిగా కావాలనే కల. బ‌ల‌మైన భావాలు క‌ల అమ్మాయి. అలాంటి ఆమెకు ద‌ర్శ‌కుడు రోష‌న్‌తో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఓసారి అనుకోకుండా సినిమా నిర్మాత‌ను క‌ల‌వ‌డానికి  బెంగుళూరు ష‌డెన్‌గా వెళ్ళాల్సి వుంటుంది. స‌రిగ్గా ఆ టైంలో ఆమెకు రామచంద్రయ్య (అభినవ్ మేడిశెట్టి) ఓ ప‌నిమీద క‌లుస్తాడు. మాట‌ల్లో ఆమె బెంగుళూరు వెళుతుంద‌ని తెలుసుకుని త‌నూ ప‌నిమీద అటే వెళుతున్నాన‌ని అన‌డంతో ఇద్ద‌రూ క‌లిసి బెంగుళూరు ప్ర‌యాణం సాగిస్తారు. ఈ జ‌ర్నీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే మిగిలిన సినిమా. అస‌లు రామ‌చంద్ర‌య్య ఎవ‌రు? క‌రెక్ట్‌గా ఆమెను ఎందుకు క‌లిశాడు? అనేది చిత్రంలోని ఆస‌క్తిక‌ర అంశం.
 
విశ్లేష‌ణః
రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో వ‌చ్చిన ప‌లు చిత్రాల్లోని అంశంకంటే కొంచెం నూత‌నంగా వున్న అంశం ఇది. హైద‌రాబాద్ టు బెంగుళూరు 9 గంట‌ల జ‌ర్నీలో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మాట‌లు, ప‌రిచ‌యాలు ప్రేమ‌కు ఎలా దారితీశాయి అనేది ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. అందుకే క‌థ‌కు త‌గిన‌విధంగా మైల్స్ ఆఫ్ లవ్ పేరు పెట్టారు. ప్రేమికుల‌కు ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్పాలి. రోష‌న్తో నిశ్చితార్థం జ‌రిగినా రామచంద్రయ్య  ప‌రిచ‌యంతో ఆమె మ‌న‌సు మార‌డం సంద‌ర్భానుసారంగా ద‌ర్శ‌కుడు మ‌లిచాడు.
 
నీలాంబ‌రి ప్ర‌తిభ‌ను ద‌ర్శ‌కుడు అయిన రోష‌న్ ఎలా త‌న‌దిగా మార్చుకోవాల‌ని చూస్తాడ‌నేది సినిమాలో కీల‌క అంశం. ఇది సినిమారంగంలో చోటుచేసుకున్న అంశ‌మే. కానీ ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల‌నుకునే వారు కొంద‌రు ఎలా దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరోన‌ని ఇందులో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు. కానీ చివ‌ర‌గా ఆమె ఆశ‌యం కోసం ఆ విష‌యంలో రోష‌న్‌ను ఎలా ఎదుర్కొంది అనేది చ‌క్క‌గా చూపించాడు. ద‌ర్శ‌కుడు నంద‌న్ సినిమారంగంలోని విష‌యాల‌ను చ‌ర్చించాడు క‌నుక ఆయ‌న‌కున్న అనుభ‌వాల‌నుగానీ, చూసిన విష‌యాల‌నుకానీ ఇందులో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.
 
ఒక రోజులో జరిగే క‌థ కాబ‌ట్టి ఆసక్తికరంగా చూపే ప్ర‌య‌త్నం జ‌రిగింది. కొత్త‌వారైనా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ర‌మ్య కు ఇది రెండో సినిమా. చ‌క్క‌టి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక అభిన‌వ్ లుక్‌, ఆయ‌న చురుకుద‌నం సినిమాకు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇద్ద‌రికీ ఒక‌రినొక‌రు ప‌రిచ‌యం వుంద‌నీ తెలిసి ఆ త‌ర్వాత వారి సంఘ‌ర్ష‌ణ ఎలా వుంటుంద‌నేది బాధ‌తో కూడిన వారి ముఖ‌క‌వ‌ళిక‌ల‌లో చూపించారు.

వారిమ‌ధ్య ప్రేమ ఎలా దారితీశాయ‌నేది సంభాష‌ణ‌ల రూపంలో పొందిక‌గా వున్నాయి.  పాట‌లు, సంగీతం ప‌ర్వాలేద‌నేలా వున్నాయి.సిద్ శ్రీ‌రామ్ పాడిన పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
ప‌రిమిత బ‌డ్జెట్ అయినా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇటువంటి క‌థ‌కు సినిమాటోగ్రఫీ కీల‌కం. ఆ బాధ్య‌త‌ను రవి మణి కె నాయుడు చ‌క్క‌గా చూపాడు. ఒక‌ర‌కంగా క్లాసిక్ మూవీ తీసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే క‌థ‌నంలో కామడీ ట్రాక్  తెలంగాణ యాస‌లో వుంటూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంకాస్త వుంటే బాగుండేది.
 
మైనస్ పాయింట్స్
సినిమా కాస్త స్లో పేస్‌తో మొదలై మెల్లగా మెయిన్ లీడ్స్‌తో రైడ్ చేస్తుంది. ఇది తొలిచిత్రం కాబట్టి
చాలా చోట్ల  చిన్న చిన్న త‌ప్పులు క‌నిపిస్తాయి. ఇక మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్‌లు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి ఉండాలి. ఇటువంటి సినిమాల‌కు స‌రైన ప్ర‌చారం చేస్తే మ‌రింతగా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు చేరుకుంటుంది.
రేటింగ్ః 2.75/5