శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 1 ఆగస్టు 2019 (15:53 IST)

అత్తి వరదరాజ స్వామి నా కలలో కన్పించాడు... తననలాగే నిలబెట్టి వుంచమన్నాడు... ఎవరు?

అత్తి వరదరాజ స్వామి. తిరుమలలో గోవింద నామాలతో ఎలా మారుమోగుతుందో ఇప్పుడు కాంచీపురంలో కొలువై వున్న అత్తివరదరాజ స్వామి వారి సన్నిధిలో కూడా భక్తులు అలాగే గోవిందా... గోవిందా... అంటూ వరదరాజ స్వామి వారిని కీర్తిస్తున్నారు. ప్రతి 40 ఏళ్లకి ఒకసారి స్వామివారు 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో శయనాగతిలోకి వెళుతారు. 
 
ఐతే ఈసారి స్వామివారిని అలా కోనేటిలోకి పంపవద్దని మనవాల మమునిగల్ మఠానికి చెందిన శఠగోప రామానుజా జీయర్ చెపుతున్నారు. అశేష భక్తజన సందోహం స్వామివారిని దర్శిస్తున్నందున ఆయన రూపాన్ని ఆలయంలోనే ప్రతిష్టించి ఆ స్వామివారి ఆశీస్సులకు భక్తులు పాత్రులయ్యేలా వుంచాలని చెపుతున్నారు. తనతోపాటు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం ఇదేనంటూ వెల్లడించారు.
 
ఇకపోతే కాంచీపురం మంగళశాసన దివ్యదేశ సంరక్షణ ట్రస్టుకు చెందిన కృష్ణప్రేమి చెపుతూ... అత్తివరదరాజ స్వామివారు తనకు కలలో కన్పించాడనీ, తనను తిరిగి కోనేటిలో నిక్షిప్తం చేయవద్దని చెప్పారన్నారు. అంతేకాదు... నిత్యం భక్తులను ఆశీర్వదించేందుకు తనను ఆలయంలోనే వుంచాలని వరదుడు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖవారికి విన్నవించినట్లు కూడా చెప్పారు.

మరి... సంప్రదాయం ప్రకారం అత్తి వరదరాజ స్వామిని ఆగస్టు 18 తర్వాత తిరిగి కోనేటిలో శయనాగతికి పంపిస్తారో లేదంటే ఆలయంలోనే వుంచుతారో చూడాల్సి వుంది.