సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (19:25 IST)

పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం.. ఇకపై అక్కడి నుంచే పవన్ రాకపోకలు!!

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఎన్నికల ప్రచార ప్రణాళికపై ప్రధానంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తాను పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అలాగే, తాను కూడా ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు సాగించాలని భావిస్తున్నారు. 
 
పురూహూతిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తన ప్రచారరథం వారాహి వాహనంలో ప్రచారానికి బయలుదేరాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజులు పాటు ప్రచారం చేసేలా ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు. 
 
కాగా, పిఠాపురం నుంచి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార సమరశంఖం పూరించనుంది. ఆ శంఖారావం రాష్ట్రవ్యాప్తంగా వినిపించాలని పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇవి రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని, ఖచ్చితంగా విజయం మనదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.