సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (12:11 IST)

చలికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు.. తెలుగు రాష్ట్రాల్లో 34 మంది మృత్యువాత

సాధారణంగా ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారనే వార్తలను ప్రతి ఒక్కరూ వినేవుంటారు. కానీ, ఈ యేడాది చలికి కూడా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. చలిని తట్టుకోలేకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏకంగా 34 మంది చనిపోయారు.
 
ఇటీవల కోస్తాంధ్రను తాకిన పెథాయ్ తుఫానుతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు ప్రాణాలను బలిగొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోగా, చలి తీవ్రతకు తట్టుకోలేక, సోమ, మంగళవారాల్లో 34 మంది చనిపోయారు. 
 
ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 మంది, తెలంగాణలో 11 మంది చలికి ప్రాణాలు విడిచారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడగా, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే కావడం గమనార్హం.
 
కాగా, హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకన్నా తక్కువకు, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. శీతల గాలుల కారణంగా వాతావరణం బాగా చల్లబడిందని, రానున్న మూడు, నాలుగు రోజుల్లో చలి పులి తన పంజాను మరింత బలంగా విసరనుందని అధికారులు హెచ్చరించారు. బయట తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.