గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (12:12 IST)

ఐపీఎస్ అధికారులపై ముంబై నటి జెత్వానీ ఫిర్యాదు!!

jethwani
తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, సీతారామాంజనేయులుపై ముంబై నటి కాదంబరి జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె తన కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారిణి ఏసీపీ స్రవంతిని కలిసి ఫిర్యాదు చేశారు. 
 
గత వైకాపా ప్రభుత్వం ఆ పార్టీకి చెందిన కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని వాపోయారు. విద్యాసాగర్‌తో పోలీసు ఉన్నతాధికారులు కుమ్మక్కై... ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదుచేశారని ఆరోపించారు. ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే ఇబ్రహీంపట్నం స్టేషనులో తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. 
 
ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆఘమేఘాలపై ముంబై వచ్చి... తనతో పాటు తల్లిదండ్రులనూ అరెస్టు చేయడం కుట్రలో భాగమే అన్నారు. పోలీసు కస్టడీలో తనను ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారించారనీ, ముంబైలో కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి, తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
 
కాగా, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, 17 క్రిమినల్ కేసులు ఉన్న కుక్కల విద్యాసాగర్కు వైకాపా నేతలు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. అటువంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తనను, తన కుటుంబాన్ని నాశనం చేసి పబ్బం గడుపుకోవాలని విద్యాసాగర్ చూస్తున్నారని, ఇటువంటి దారుణ పరిస్థితుల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పైగా, కొందరు ఐపీఎస్ అధికారులు, వైకాపా నేతతో కలిసి తనను వేధింపులకు గురిచేసిన కేసును రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. 
 
కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధి దాటి వ్యవహరించడంతో వారిపై ఫిర్యాదు ఇచ్చానని, పోలీసు కమిషనర్ త్వరితగతిన కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనను అరెస్టు చేసిన సమయంలో 10 ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. వాటిలో చాలా ఆధారాలున్నాయి. ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.