మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (09:36 IST)

నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు - హైకోర్టు తీర్పుపైనే ప్రధాన చర్చ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ఉభయసభను వాయిదా వేశారు. 
 
అయితే, ఏపీ గవర్నరుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హరిచందన్ తొలిసారి అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత 2020, 2021 సంవత్సరాల్లో జరిగిన బడ్జెట్ సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో వర్చువల్ విధానంలోనే ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్‌‌ను ఖరారు చేస్తారు. బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిసిస్తారు. ఇందులో శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తుంది. 
 
ముఖ్యంగా, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తరువాత అనుసరించే సంప్రదాయాన్ని పాటిస్తూ అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడతాయి.
 
అలాగే, ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీకానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు తన నివాసంలో జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.