ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (13:44 IST)

వైకాపా గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య!!

suicide
ఏపీలో ముగిసిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని చాలా మంది కోట్లాది రూపాయల మేరకు బెట్టింగులు పెట్టారు. ఇలాంటిం వారిలో ఓ వార్డు మెంబర్ కూడా ఉన్నారు. ఈయన ఏకంగా రూ.30 కోట్ల మేరకు బెట్టింగ్ పెట్టాడు. కానీ, వైకాపా ఓడిపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఏం చేయాలో పాలుపోక... ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన  ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పుదిగవల్ల గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నాడు. ఆయన భార్య సర్పంచ్. కరుడుగట్టిన వైకాపా మద్దతుదారులు. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు బెట్టింగులు కట్టారు. ఈ నెల 4వ తేదీన వెల్లడైన ఫలితాల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. 
 
దీంతో ఆయన ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. బెట్టింగులు కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందించలేదు. ఈ నెల 7వ తేదీన పందెం వేసిన వారు కూడా ఆయన ఇంటికి వెళ్లి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి.. బెట్టింగులు కట్టినవారు చేసిన పనికి తీవ్ర మనస్తాపం చెందారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
మృతదేహం వద్ద పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.