శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (12:54 IST)

జగన్ సర్కారు వర్సెస్ ఎస్ఈసీ : నిమ్మగడ్డ ఆదేశాలను పాటించని ఆదిత్యనాథ్?

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. ఈ వార్‌లో భాగంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీచేసిన ఆదేశాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
 
తాజాగా మరో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమిస్తూ గురువారం సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు. 
 
ఆ తర్వాత రవిచంద్రన్‌ను వైద్య ఆరోగ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కోవిడ్ టీకాల కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. హడావుడిగా దీని కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా కార్యదర్శి పోస్టును ప్రభుత్వం సృష్టించి మరీ నియామకం చేపట్టింది. 
 
గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూసిన రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎస్ఈసీ నియమించడంతో ప్రభుత్వం హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఎస్ఈసీ కార్యదర్శిగా ఉన్న వాణిమోహన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం కమిషన్ పనితీరుపై ప్రభావం చూపుతోందని ముగ్గురు అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.
 
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూసిన రవిచంద్రను కార్యదర్శిగా నియమిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రవిచంద్రను వేరే పోస్టు సృష్టించి ఇవ్వడంతో మరోసారి వివాదం ముదిరింది. అదేసమయంలో కొత్తగా, ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టుకు ఐఏఎస్ అధికారులు రాజబాబు, కన్నబాబు, విజయకుమార్ల పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపడం గమనార్హం.