సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని ఖాకీలను జైలుకు పంపిస్తాం : హైకోర్టు వార్నింగ్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని పోలీసులను లోపల(జైలు)కు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్ల లోపు జైలుశిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. అలాంటి కేసుల్లో సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపింది. పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు నిలదీసింది.
సాంబశివరావును అరెస్టు చేస్తే బాధ్యలు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించని అధికారులను లోపల పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో వివరాలు అందించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణనను హైకోర్టు మంగళవారానికి వాయిదావేసింది.