ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 31 మే 2017 (20:22 IST)

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రులు నారాయణ, సునీత వెల్లడి

అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీతతో కలసి సచివాలయ

అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీతతో కలసి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు పూర్వప్రాథమిక విద్యలో మెరుగైన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు మంత్రి నారాయణ చెప్పారు. 
 
దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రీ స్కూల్ విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా.. వారి కుటుంబాలపై కాన్వెంటు ఫీజుల భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దీంతో పాటు చిన్నారుల మానసిక, శారీరక, వైజ్ఙానిక, సామాజికాభివృద్ధిని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నారాయణ విద్యా సంస్థల టీచర్లతో శిక్షణ ఇప్పించినట్టు చెప్పారు. అలాగే ప్రీ స్కూల్ విద్య కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేయించడంతో పాటు, పిల్లల వయస్సు ఆధారంగా వర్క్ బుక్స్, యాక్టివిటీ బుక్ లను కూడా తయారు చేయించి.. కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
 
అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను అభినందిస్తున్నామని మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీత అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే కోడిగుడ్డు, పాలతో పాటు, ఒక పూట భోజనం చిన్నారులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పిల్లల వృద్ధిని తెలిపేలా ఎత్తు, బరువులను కొలిచి.. వారిలో పోషకాహార లోపం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ప్రైవేటు కాన్వెంట్లకు ఆకర్షితులు కాకుండా..నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యను అందించేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల ఆనందంగా ఉన్నామన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలుంటే.. మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో 7,882 అంగన్వాడీ కేంద్రాలున్నాయని.. వీటన్నిటిలోనూ మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు, కార్పొరేట్ స్థాయిలో ప్రీ స్కూల్ విద్యను అందించబోతున్నామని.. వారికి పుస్తకాలు అందించడంతో పాటు, డ్రెస్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సునీత తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవెన్, డైరెక్టర్ కన్నబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సి.ఎల్.వెంకట్రావ్, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయ్, కమిషనర్ అరుణ్ కుమార్, మెప్మా డైరెక్టర్ చిన తాతయ్య, శిశు సంక్షేమ శాఖ పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.