ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (08:54 IST)

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు!!

Chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఓ రికార్డు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన ఉంటుందని తొలుత భాపించారు. అయితే, అదే రోజున దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య నేతల సమావేశం బుధవారం జరిగింది. ఇందులో చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. అలాగే, ఈ నెల 7వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. అదే రోజున బీజేపీన పార్లమెంటరీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత ఎన్డీయే నేతల భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి ఎన్డీయేకు చెందిన ఎంపీలంతా హాజరుకావాలని కోరనున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీయే నేతలు కోరనున్నారు. 
 
కాగా, ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.