జగన్ వస్తున్నాడంటే... ముందు గొడ్డలి వస్తుంది.. ఆ తర్వాతే ఆ సైకో వస్తాడు : చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రజాగళం సభలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్‌పై వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ ఆదివారం జాతీయ రహదారిపై ప్రయాణించినా సరే చెట్లు నరికేశారని ఆరోపించారు. జగన్ వస్తున్నాడంటే... ముందు గొడ్డలి వస్తుంది, ఆ తర్వాత జగన్ వస్తాడు అని ఎద్దేవా చేశారు. జగన్ ఫ్యాన్ తిరగడం మానేసింది... దాన్ని ప్రజలు తుక్కు తుక్కు చేసి చెత్తకుండీలో వేసేస్తారు... కావాలంటే గొడ్డలిని నీ సింబల్‌గా పెట్టుకో... ప్రజలు నీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు... శని వదిలిపోతుంది అని వ్యాఖ్యానించారు.
'ఇంకా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం ఉంది. ప్రజాస్వామ్యం కాబట్టి జగన్ పదవిలో ఉంటాడంతే. ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం చేయాల్సిందే. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ సమానం. ఆ విషయాన్ని మర్చిపోయి మా మీటింగులకు భద్రత కల్పించకుండా, ముఖ్యమంత్రి మీటింగులకు మాత్రం ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నేను కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. అతడు (జగన్) రేపో, ఎల్లుండో మాజీ సీఎం అవుతున్నాడు. అది ఎక్స్ పైర్ అయిన మందు... వాడినా పవర్ ఉండదు అని అన్నారు.
ముఖ్యమంత్రి అంటున్నాడు... ఆయన ఒంటరిగా వస్తున్నాడంట. కాదు... నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికల్లో తండ్రి లేని బిడ్డ అంటూ వచ్చాడు... 2019లో తండ్రి లేడు, బాబాయ్ కూడా పోయాడు అని చెప్పాడు... ఇప్పుడు పెన్షన్ దారులైన వృద్ధుల మృతదేహాలతో వచ్చాడు. ఇక్కడే ఒక మహా నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు... శవరాజకీయాలు ప్రారంభించాడు. నీ సంగతేంటో, నీ శవరాజకీయాలు ఏంటో చూస్తా. పరిగెత్తించే రోజు దగ్గర్లోనే ఉంది. పెనమలూరు నియోజకవర్గం ప్రజలు అతడ్ని తిరుగుటపాలో పంపించాలంటూ పిలుపునిచ్చారు.
ఆ పార్టీలో మంచివాళ్లకు చోటు లేదు. బాలశౌరి, పార్థసారథి వంటి నేతలు ఆ పార్టీలో ఉండలేక బయటికి వచ్చేశారు. నన్ను, పవన్ కల్యాణ్‌ను తిడితే టికెట్ ఇస్తారంట. ఆ పార్టీలో ఉండేది గుడివాడ బూతుల నాని, ఇంకొకడు గన్నవరంలో ఉంటాడు, ఇంకొకాయన ఇక్కడికి వచ్చాడు మహా మేధావి. ఇంకొక నాని మచిలీపట్నంలో ఉన్నాడు... వీళ్లు నాయకులు... మీరు వాళ్లకు ఓట్లేయాలంట అంటూ వ్యాఖ్యానించారు.