ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు
గతంలో హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు మహ్మద్ రహేల్ అమీర్‌ను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వచ్చిన రహేల్‌ను సోమవారం పోలీసులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అతని కోసం గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. అయితే, ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు.
ఈ ప్రమాదం తర్వాత రహేల్ బదులుగా మరొకరిని డ్రైవర్‌గా చేరి రహేల్‌ను దుబాయ్‌కు పారిపోయేలా కొందరు పోలీసులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు రహేల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో సోమవారం రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగిరాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు.