మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (16:15 IST)

'మేం లేచి పరుగందుకున్నాం' - తొలి విజయంపై హార్దిక్ పాండ్యా స్పందన!!

hardik pandya
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు ఓటముల తర్వాత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 29 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ముంబై జట్టు కెప్టెన్‌గా వరుస ఓటములతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యకు కాస్త ఉపశమనం లభించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. 
 
ఈ గెలుపు తర్వాత హార్దిక్ పాండ్యా స్పందిస్తూ, "మేం లేచి పరుగందుకున్నాం" అనే క్యాప్షన్‌తో మ్యాచ్ తాలూకూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, తమ అభిమాన ఫ్రాంచైజీ ముంబై జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయడంతో ఆ జట్టు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వరుస విజయాలతో దూసుకెళ్లాలని వారు కోరుతున్నారు. 
 
కాగా, ఆదివారం వాంఖడే వేదికగా దిల్లీ క్యాపిటల్స్​పై 29 పరుగుల తేడాతో నెగ్గి ఈ సీజన్​లో గెలుపు రుచి చూసింది. ముంబై నిర్దేశించిన 235 భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 205-8 పరుగులకే పరిమితమైంది. ట్రిస్టన్ స్టబ్స్ 71 పరుగులు, పృథ్వీ షా 66 పరుగులతో రాణించినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక ముంబై బౌలర్లలో గెరాల్డ్ కాట్జీ 4, జస్​ప్రీత్ బుమ్రా 2, రొమారియో షెపర్డ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
 
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10) స్వల్ప స్కోర్​కే వెనుదిరిగాడు. అయినప్పటికీ పృథ్వీ షా, వన్​డౌన్​లో వచ్చిన అభిషేక్ పోరెల్ అదరగొట్టారు. ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటు ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో పృథ్వీ అర్థ శతరం పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. అద్భుత యార్కర్​తో షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అభిషేక్, కెప్టెన్ రిషబ్ పంత్ (1) కూడా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.
 
ఢిల్లీ ఘనమైన ఆరంభాన్ని స్టబ్స్ కొనసాగించాడు. ఓ ఎండ్​లో వికెట్లు పడుతున్నా ఏ మాత్రం బెదరకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బుమ్రా మినహా ముంబై బౌలర్లను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని మెరుపు వేగంతో పరుగులు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే స్టబ్స్ ఆడుతున్నంతసేపు దిల్లీ గెలుస్తుందనుకున్నారంతా. అటు ఢిల్లీ ఇన్నింగ్స్​లోనూ స్టబ్స్ ఆటే హైలైట్. ఇక చివర్లో క్రమం తప్పకుండా వికెట్లు పడడం, కావాల్సిన రన్​రేట్ పెరగడం వల్ల ఢిల్లీ ఒత్తిడికి గురైంది. ఆఖరి ఓవర్లో 34 పరుగులు కావాల్సిన దశలో గెరాల్డ్ 4 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ముంబయికి విజయాన్ని అందించాడు.
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లపై దండయాత్ర చేశారు. రోహిత్ శర్మ 49 పరుగులు, ఇషాన్ కిషన్ 42 పరుగులు అదరగొట్టగా, టిమ్ డేవిడ్ (45 పరుగులు), రొమారియో షెపర్డ్ (39 పరుగులు, 10 బంతుల్లో) ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ చివరి 30 బంతుల్లో 96 పరుగులు పిండుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో నోకియా 2, అక్షర్ పటేల్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు.