బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (13:22 IST)

వరుస ఓటముల ఎఫెక్ట్... సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు

hardik pandian
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటుంది. దీంతో జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించాడు. సంప్రదాయ దుస్తుల్లో అతడు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి రోజూ భక్తులు మహాదేవుడి సందర్శనార్థం వస్తుంటారు.
 
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తడబాటుకు లోనవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ జట్టు కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ విషయంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది.
 
తొలుత గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత హైదరాబాద్ చేతిలోనూ పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఓ రేంజ్‌లో అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టేడియంలో అనేక సార్లు ప్రేక్షకులు హార్డికన్‌ను చూసి రోహిత్ శర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు.
 
ఇక, రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.