చిత్తూరు-నెల్లూరు జిల్లాలు కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్: అమరనాధరెడ్డి
అమరావతి: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యుఎన్ఓ) ప్రకటించిన ప్రకారం ఈ నెల 27న జరిగే సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసా
అమరావతి: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యుఎన్ఓ) ప్రకటించిన ప్రకారం ఈ నెల 27న జరిగే సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ వాణిజ్యం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి ఎన్. అమరనాధరెడ్డి చెప్పారు. సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పోరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారన్నారు.
సూక్ష్మ,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రల ద్వారా అత్యధిక మందికి ఉపాధి లభించే అకాశం ఉందని, అందు వల్ల ప్రభుత్వం ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో 19,193 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల ద్వారా 2.26 లక్షల మందికి ఉపాధి లభించినట్లు వివరించారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అభించే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో ఈ పార్కుల కోసం భూములు ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా ఆ సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ రంగంలో మూతపడిన పరిశ్రమలను పున:ప్రారంభించేందుకు రూ.160 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్
మన రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల కోస్తా తీరం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. ఉపాధి కూడా అత్యధిక మందికి లభించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లోని 50 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్‌గా కేంద్రం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కారిడార్ అభివృద్ధికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాక్ రూ.5500 కోట్లు, ఇతర బ్యాంకులు రూ. 4 వేల కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ప్రారంభించే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వారికి ఆయా పరిశ్రమల్లో అవసరాలమేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్‌లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం కాలేజీల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.