బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (08:09 IST)

పీపీఏల వ్యవహారంలో జగన్ సర్కారుకు చుక్కెదురు

పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

పీపీఏల సమీక్ష కోసం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 63 అమలును, విద్యుత్‌ ధరల తగ్గింపు కోసం ఆ కమిటీతో సంప్రదింపులు జరపాలంటూ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) రాసిన లేఖను ఇప్పటికే నిలుపుదల చేసిన హైకోర్టు.. తాజాగా ఆ రెండింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
విద్యుత్‌ స్వీకరణను తక్షణం పునరుద్ధరించాలని పేర్కొంది. టారి్‌ఫపై నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు ఏపీఈఆర్‌సీని ఆశ్రయించాలని సూచించింది. అప్పటి వరకూ గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న మేరకు విద్యుత్‌ కొనుగోలుకు నగదు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

కాగా తాము ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌పై ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్న వ్యవహారాన్ని సమీక్షించేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు మంగళవారం తీర్పు వెలువరించారు.

పీపీఏలపై సమీక్షకు ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ జూలై 1న ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని రద్దు చేయాలని కోరుతూ 50కి పైగా విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏల సమీక్ష కోసం కమిటీని నియమిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి జీవో ఇచ్చాక అదే నెల 12వ తేదీన ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆయా సంస్థలకు లేఖలు రాశారు.

ప్రాజెక్టు ప్రారంభం నుంచి బకాయిల చెల్లింపుల కోసం.. కుదించిన టారిఫ్‌ ప్రకారం బిల్లులు సమర్పించాలని.. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఆ లేఖలను కూడా రద్దు చేయాలని సంస్థలు న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి.
 
యూనిట్‌ రేటు విషయంలో తమ మాట వినకపోతే విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ, ఎస్పీడీసీఎల్‌ అధికారులు బెదిరిస్తున్నారని, టారిఫ్‌ రద్దుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరోధించాలని కోరాయి.

అలాగే ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌ స్వీకరణను నిలిపేయడంతో రూ.వందలాది కోట్లు వెచ్చించి పెట్టిన తమ కర్మాగారాలు సంక్షోభంలో కూరుకుపోయే ముప్పుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చా యి. ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం.. జూలై 25వ తేదీన జీవోను, ఎస్పీడీసీఎల్‌ లేఖను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు మంగళవారం తీర్పు వెలువరించారు.
 
యూనిట్‌ ధర అధికం గా ఉందన్న కారణంగా విద్యుదుత్పత్తి దారుల నుంచి విద్యుత్‌ తీసుకోవడాన్ని నిలిపేయడం, కోత విధించడం వంటి చర్యలకు పాల్పడడం సరికాదని, ధర అధికంగా ఉందని భావిస్తే సర్దుబాటు తదితరాల ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకోవాలి తప్ప కోత విధించడం, విద్యుత్‌ స్వీకరణ నిలిపేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఏ నిర్ణయమైనా పీపీఏల మేరకే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పీపీఏల్లో జోక్యం చేసుకునేందుకు వీలుందన్నారు. ఈఆర్‌సీ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని, ఈఆర్‌సీని ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని పేర్కొన్నారు.
 
విద్యుత్‌ ధరలను పునఃసమీక్షించే అధికారం ఈఆర్‌సీకి లేదని విద్యుదుత్పత్తి సంస్థలు చేసిన వాదనలతో ఏకీభవించలేమని కూడా స్పష్టం చేశారు. 41 పీపీఏల విషయంలో వాటి నిబంధనలను నియంత్రించే అధికారం తమకుందని 2017 లోనే ఏపీఈఆర్‌సీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు.

టారిఫ్‌ తగ్గింపుపైనా, పునఃసమీక్షలపైనా ఈఆర్‌సీని ఆశ్రయించాలని ఆదేశించారు. ఈఆర్‌సీలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో పాటు సాంకేతిక నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నందున దానిపై అక్కడే తేల్చుకోవాలని సూచించారు. ఇరువర్గాలు తమ అభ్యంతరాలను ఈఆర్‌సీ ముందు లేవనెత్తి పరిష్కారం పొందాలని పేర్కొన్నారు.
 
ఈఆర్‌సీ నిర్ణయం వెలువడే వరకూ గతంలో ప్రభుత్వం నిర్ణయించిన మేర పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలని విద్యుదుత్పత్తి సంస్థలను ఆదేశించారు. ఆ మేరకు బకాయిలను చెల్లించాలని నిర్దేశించారు.

అదే విధంగా ఈఆర్‌సీ నిర్ణయం వెలువడే వరకు ఇదే ధర కొనసాగుతుందన్నారు. భారీ పెట్టుబడులకు తోడు బకాయిలు నిలిచిపోతే సమస్యలు ఎదురవుతాయన్న విద్యుదుత్పత్తి సంస్థల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల్లోపు నిర్ణయం వెల్లడించాలని ఏపీఈఆర్‌సీని న్యాయమూర్తి ఆదేశించారు.