బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (11:14 IST)

ఏపీ సీఎం జగన్‌కు షాక్.. 11న విచారణకు హాజరు కావాలి.. కోర్టు సమన్లు

ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ కోర్టు సమన్లు జారీచేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌ను ఆదేశించింది. ఆయనతో పాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. 
 
ఇక, నాంపల్లి కోర్టు నుంచి అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమన్లపై జగన్ తరఫు న్యాయవాదులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 11వ తేదీన వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతారా? లేక ఆయన తరఫును న్యాయవాదులు ఏదైనా మినహాయింపు కోరతారా? అనేది తేలాల్సి ఉంది.
 
జగన్‌ ఆస్తుల కేసులపై సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న చార్జిషీట్‌ను కూడా స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్‌లో కోరింది. దీంతో ఈ చార్జిషీట్‌ను ఈడీ కోర్టుకు బదిలీ చేశారు. శుక్రవారం ఆ చార్జిషీట్‌పై విచారణ చేపట్టిన ఈడీ కోర్టు.. వైఎస్ జగన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.