బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (10:48 IST)

మహిళా భద్రతపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. దిశ యాప్‌ను ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని అధికారులకు  స్పష్టం చేశారు. 
 
మహిళా భద్రత, దిశ యాప్‌ వినియోగంపై ఆయన ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీఎంవో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇంటింటికీ వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లకు తొలుత శిక్షణ ఇచ్చి, తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలన్నారు. 
 
ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంపై అక్క చెల్లెమ్మలకు విడమరచి చెప్పాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలని, ఈ చర్యతో దిశ యాప్‌ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు.