పెన్నాకు గోదారి జలధార... రూ. లక్ష కోట్లతో ఏపీలో భారీ ప్రాజెక్టు
విజయవాడ : మరో భారీ సాగునీటి ప్రాజెక్టు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 400 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌లోని సోమశిలకు మళ్లించే బృహత్తర పథకంపై అధ్యయనం చేయించింది. ఈ స్థాయిలో నీటిని మళ్లించడానికి అక్షరాలా లక్షా ఐద
విజయవాడ : మరో భారీ సాగునీటి ప్రాజెక్టు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 400 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌లోని సోమశిలకు మళ్లించే బృహత్తర పథకంపై అధ్యయనం చేయించింది. ఈ స్థాయిలో నీటిని మళ్లించడానికి అక్షరాలా లక్షా ఐదువేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని పథకంపై అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 360 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి అవకాశం ఉంది. గోదావరి-పెన్నాను అనుసంధానించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 4 ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేశారు. అధ్యయనానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద నీటిలో 400 టీఎంసీలను పోలవరం వద్ద నుంచి పెన్నా బేసిన్‌లోని సోమశిలకు మళ్లించడానికి అవకాశం ఉందని వ్యాప్కోస్ కన్సల్టెన్సీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో భాగంగా 360 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు గోదావరి-పెన్నా అనుసంధానంపై అధ్యయనం చేసిన వ్యాప్కోస్... ఈ భారీ ప్రాజెక్టు చేపట్టడానికి 4 ప్రత్యామ్నాయాలను నివేదించింది. ప్రస్తుతం గోదావరి నీటి వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనం జరిగింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా గోదావరి బేసిన్‌లోని రాష్ట్రాల కేటాయింపులు, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని వరద పోలవరం వద్ద ఎన్ని రోజులు... ఏ మేరకు ఉంటుంది... ఎంత మళ్లించడానికి అవకాశం ఉందో పరిశీలించింది.
ప్రస్తుతం గోదావరి బేసిన్లో ఉన్న వినియోగం ప్రకారం మొదట 105 రోజుల్లో రోజుకు 40,730 క్యూసెక్కుల చొప్పున 400 టీఎంసీలు మళ్లించవచ్చని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. ఇలా మళ్లించే నీటిలో 160 టీఎంసీలు నిల్వ చేయడానికి రిజర్వాయర్లు అవసరమని తెలిపింది. 2000-01 నుంచి 2014-15 వరకు వరద నీటి వివరాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్లు కన్సల్టెన్సీ సంస్థ నివేదించింది. గోదావరి బేసిన్ ప్రాంతంలోని రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే నీటి లభ్యత కొంత తగ్గుతుందని, అప్పుడు రోజూ 50,470 క్యూసెక్కుల చొప్పున 86 రోజుల్లో 400 టీఎంసీలు మళ్లించవచ్చని, నీటి నిల్వకు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 200 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుందని వెల్లడించింది.
నిర్మాణంలో ఉన్నవాటితో పాటు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే మిగులు జలాలు బాగా తగ్గుతాయని, అప్పుడు రోజుకు 92వేల క్యూసెక్కుల చొప్పున 32 రోజుల్లో మళ్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇందుకోసం 360 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే బౌగోళిక పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా ఇంద్రావతి, శబరి ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉన్నందున బేసిన్‌లోని రాష్ట్రాలు 75 శాతం నీటి లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేవని, 400 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 56,500 క్యూసెక్కుల చొప్పున మళ్లిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది.
మొదట రోజుకు 3.5 టీఎంసీల(40,730 క్యూసెక్కులు) నీటిని మళ్లించేలా పథకాన్ని చేపట్టాలని సిఫార్సు చేసింది. తర్వాత అదనపు పంపులు, మోటార్లు ఏర్పాటు చేయడంతోపాటు సొరంగ మార్గాల విస్తరణ, అక్విడక్ట్ సామర్థ్యం పెంచి రోజుకు 4.9 టీఎంసీలను మళ్లించవచ్చని పేర్కొంది. అయితే ఈ అవసరం రెండు దశాబ్దాల తర్వాతనే ఉంటుందని, అప్పుడు కాలువ సామర్థ్యం పెంచడం అధిక వ్యయంతో కూడుకున్న పని కాబట్టి, కాలువను మాత్రమే 4.9 టీఎంసీల సామర్థ్యం మేరకు ఇప్పుడే చేపట్టాలని సిఫార్సు చేసింది.
ప్రత్యామ్నాయాలు
1. పోలవరం వద్ద గోదావరి నది 25 మీటర్ల మట్టం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీరు మళ్లిస్తారు. అక్కడ నుంచి కాలువ, సొరంగాల ద్వారా సోమశిల రిజర్వాయరుకు గోదావరి ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో ఎలాంటి అదనపు రిజర్వాయర్లు ఉండవు.
2. పోలవరం డ్యాం నుంచి 45 మీటర్ల మట్టంతో నీటిని 80 మీటర్ల ఎత్తుకు మళ్లిస్తారు. ఈ ప్రతిపాదనలో 650 కి.మీ. దూరం కాలువ, 24 కి.మీ. సొరంగమార్గం ఉంటాయి. మార్గమధ్యంలో నాలుగైదు రిజర్వాయర్లను నింపుతారు.
3. పోలవరం డ్యాం 45 మీటర్ల మట్టం నుంచి 65 మీటర్ల ఎత్తుకు నీటిని మళ్లిస్తారు. మార్గ మధ్యంలో కృష్ణానదిలో 3 కిలోమీటర్ల ఆక్విడెక్ట్ నిర్మిస్తారు. ఈ ప్రతిపాదనలో 600 కి.మీ. కాలువ, 25 కి.మీ. సొరంగ మార్గం ఉంటుంది.