హస్తకళాకారుల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభిన్న కార్యక్రమాల అమలు: లక్ష్మినాధ్
హస్తకళాకారుల ఉన్నతి కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని లేపాక్షి నిర్వహణా సంచాలకులు లక్ష్మినాధ్ అన్నారు. పధకాలను సద్వినియోగం చేసుకుంటే హస్తకళాకారులు మరి కొందరికి ఉపాధిని చూపగలిగిన స్ధాయికి చేరుకుంటారని స్పష్టం చేసారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో విజయవాడ హోటల్ మెట్రోపాలిటన్‌లో హస్తకళాకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.
ప్రత్యేకించి ఈ-మార్కెటింగ్, జిఎస్ టి తదితర అంశాలపై హస్తకళాకారులకు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మినాధ్ మాట్లాడుతూ... లేపాక్షి ద్వారా హస్తకళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుందని వివరించారు. మధ్యవర్తుల బెడద నుండి విముక్తి పొంది లేపాక్షి సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కళాకారులకు అవసరమైన శిక్షణతో పాటు విలువ అధారిత సేవల పరంగానూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు మార్గనిర్ధేశకత్వం చేస్తున్నాయన్నారు. శిల్పారామం సిఇఓ జయరాజ్ ప్రారంభోపన్యాసం చేస్తూ హస్తకళాకారులు ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ అభివృద్ధి కమీషనరేట్ ఉప సంచాలకులు డాక్టర్ మనోజ్ లంక మాట్లాడుతూ పధకాలకు సంబంధించిన పూర్తి సమాచారం తమ కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. జాతీయ చిన్న పరిశ్రమల సంస్ధ ప్రతినిధి కిరణ్ పాల్, వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు పాల్గొని హస్తకళాకారులకు అవసరమైన సమాచారం అందించారు. జిఎస్‌టి సంబంధించిన సేవలపై పలువురు ఆడిటర్లు ప్రసంగించారు. మచిలీపట్నంకు చెందిన కలంకారీ కళాకారులతో పాటు పలువురు హస్త కళా నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.