సాగు చట్టాల అమలుకు తాత్కాలిక బ్రేక్ : సుప్రీంకోర్టు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు సుప్రీంకోర్టు కేంద్రం తాత్కాలిక బ్రేక్ విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ కమిటీలో జితేందర్ సింగ్ మాన్ (బీకేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి (ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి (అగ్నికల్చరల్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంత్ (శివ్‌కేరి సంఘటన, మహారాష్ట్ర) కమిటీ సభ్యులుగా ఉంటారని కోర్టు పేర్కొంది.
కాగా, కేంద్రం ఏకపక్షంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ వివరణ ఇచ్చారు. వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
'మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది' అని చెప్పారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని, మీరు (రైతులు) నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని అన్నారు.
రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినిపిస్తూ, కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టుకు విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ ప్రధాన వ్యక్తి అయిన ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనికి సీజేఐ స్పందిస్తూ... 'ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేం. ఈ కేసులో ఆయన పార్టీ కాదు' అన్నారు. తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని, జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని, చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.
రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా, కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.