Toli Taram singer Bala saraswati devi
తొలి తరం గాయని, నటి శ్రీమతి రావు బాల సరస్వతి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎనిమిది దశాబ్దాల కిందటే తెలుగు, తమిళ చలన చిత్రాల్లో నటించిన శ్రీమతి బాలసరస్వతి గారు గాయనిగానూ తన గాత్రాన్ని ప్రేక్షకులకు వినిపించారు. లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారు. శ్రీమతి బాల సరస్వతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తొలి సినీ నేపథ్య గాయనీమణి రావు బాల సరస్వతి దేవి (97) ఇవాళ బుధవారం ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. పాట రూపంలో బతికే ఉంటానంటూ శాశ్వతంగా కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రం లో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు.
రావు బాల సరస్వతి దేవి సినీ లలిత సంగీత గాయని మాత్రమే కాదు. అప్పట్లో కొన్ని సినిమాల్లో నటిగానూ రాణించారు. ఎంతో శాంతంగా కనిపిస్తారు! మృధుమధురంగా కోయిలలా మాట్లాడతారు! ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు! చెదరని చిరునవ్వు ఆమె సంపద! చివరి శ్వాస వరకు సంగీతం అంటే ఇలా లేచి కూర్చునే వారు! గాయక అభిమానుల పలకరింపుకు పులకరించిపోయే వారు!
సి.పుల్లయ్య సతీ అనసూయలో బాల సరస్వతితో తొలి పాట పాడించారు! అప్పుడు ఆమె వయసు ఏడేళ్లు! అంటే 90 ఏళ్ల సినీ నేపథ్య అనుభవం! ఆమె నటించిన బాల యోగిని సినిమాతో ఆమె పేరుకు ముందు బాల చేరింది.
నిజంగా పేరుకు తగ్గట్లుగానే ఆమె నిన్నటి వరకు "బాలమిత్ర"నే! చంద్రహాస, ఇల్లాలు, రాధిక, సువర్ణమాల, వాలి సుగ్రీవ, భక్త తుకారాం తదితర చిత్రాల్లో నటిస్తూ పాటలు పాడుతూ తనదైన ముద్ర వేసుకున్నారు! డాన్సింగ్ గర్ల్ అప్పట్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదలైన తొలి చిత్రంగా రికార్డు. ఆ సినిమాలో హీరోయిన్ బాల సరస్వతి గారే. హీరో సూపర్ స్టార్ ఎంజీఆర్.
సరస్వతి దేవి గారికి ఆకాశవాణితో అద్భుత అనుబంధం
మద్రాస్ రేడియోతో పాటు విజయవాడ రేడియో కేంద్రం కూడా ఈమె పాడిన లలిత గీతంతోనే శ్రోతలకు చేరువయ్యాయి! అప్పట్లో ఆమె పాడి విడుదల చేసిన రాధా మాధవం సిడి ఒక సంచలనం! స్వప్న సుందరి, పెళ్లి సందడి, షావుకారు, జయసింహ, పిచ్చి పుల్లయ్య ఇలా 1936 నుంచి 23 ఏళ్ల పాటు తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతూ మధుర గాయనిగా గుర్తింపు పొందారు. మరో వైపు లలిత సంగీతానికి పట్టం కట్టారు! చాలా కాలం ఆమె భర్తకు తెలియకుండా పాడారు! ఒక పత్రికలో ఇంటర్వ్యూతో ఆయనకు తెలిసి ఆమె స్వరానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు! దాంతో ఆమె సినిమాలకు స్వస్తి పలికారు.
సరస్వతి దేవి భర్త వేంకటగిరి కోలంక రాజా వారు. మద్రాస్ హార్స్ రేసు గ్రౌండ్స్ లో సరస్వతి దేవిని చూసి ఇష్టపడి, సినిమా కెరీర్ కొనసాగిస్తానని మాట ఇచ్చి వివాహం చేసుకున్నారు! కానీ, పెళ్లి అయ్యాక సినిమా రంగంలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు! దాంతో నిర్మాతలు ఇబ్బంది పడకూడదని భర్తకు తెలియకుండా అంగీకరించిన సినిమాలను పూర్తి చేసినట్లు ఒక సందర్భంలో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు.
ఆమె పేరుకే జమీందారిణి. ఆస్థులు నిలబెట్టుకోలేక పోయారు. డా.కె.వి.రమణాచారి, డా.అర్జా శ్రీకాంత్, డా. రాళ్లబండి కవితా ప్రసాద్, ఆర్.వి.రమణమూర్తి లాంటి కళాహృదయలు ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహకారం, పురస్కారాల గౌరవం కల్పించారు. ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య హయాంలో వివిధ సందర్భాల్లో సన్మానించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తొలి తరం వారికి ఆమె బాగా తెలుసు. ఇప్పటి జనరేషన్ కు ఆమె తెలియకపోయినా ఆమె పాట రూపంలో బతికే ఉంటారు.