శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:45 IST)

2022 దాకా సామాజిక దూరం తప్పదా?

సామాజిక దూరం ఇఫ్పట్లో దూరం కాదా?.. మరో రెండేళ్లు దూరం పాటించొల్సిందేనా?..ప్రస్తుత కరోనా కల్లోలాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల జోస్యాలు వింటే నోరువెళ్లబెట్టక తప్పదు. సైన్స్ జర్నల్‌లో తాజాగా ప్రచురించిన ఓ పత్రం ప్రకారం కనీసం 2022 వరకు దూరం పాటించడం తప్పదు. ఒకసారి లాక్‌డౌన్ విధించగానే సరిపోదట.

మలి విడత మహమ్మారులు నియంత్రణలు కొనసాగించకపోతే మరింత ఘోరంగా ఉంటాయట. టీకా లేక చికిత్స అనేది అభివృద్ధి చెందకపోతే భవిష్యత్తులో 2025 దాకా కరోనా కల్లోలాలు రేగుతూనే ఉంటాయని అంటున్నారు. 'ఇన్ఫెక్షన్లు వ్యాపించాలంటే రెండు అంశాలు అవసరం.
 
ఒకటి ఇన్పెక్షన్‌కు గురైనవారు. రెండు ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవారు. మనకు తెలియని సామూహిక రోగనిరోధక శక్తి ఏదో ఉంటే తప్ప ఇన్పెక్షన్లు ఆగవు. నిజానికి మెజారిటీ ప్రజలు ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ కలిగి లేరు' అని పత్రం సహ రచయిత, హార్వర్డ్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మార్క్ లిపిచ్ అన్నారు.

2020 వేసవిలో వైరస్ శాంతిస్తుందనే అంచనా ఇన్ఫెక్షన్ల వ్యాప్తి చరిత్రకు అనుగుణంగా లేదు అని పేర్కొన్నారు. రాగల ఐదు సంవత్సరాల్లో ఇన్ఫెక్షన్లు ఏస్థాయిలో ఉంటాయనేది ఒకసారి కరోనాకు గురైనవారిలో శాశ్వతంగా రోగనిరోధకత వస్తుందా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది.

కానీ ప్రస్తుతం మనుషుల్లో కనిపించే కొన్నిరకాల కరోనా వైరస్‌ల తీరు చూస్తే ఏటా వచ్చిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏ ధోరణి ఎక్కుగా ఉండేందుకు ఆస్కారముందన్న ప్రశ్నకు లిపిచ్ సమాధానమిస్తూ ఇప్పుడు ఏం చెప్పినా ఊహాపోహలే అవుతాయని అన్నారు.

అన్నిరకాల పరిస్థితులను అంచనా వేసి చూస్తే ఏకకాలపు లాక్‌డౌన్‌తో ఫలితం ఉండదని, నియంత్రణలు ఎత్తివేయగానే మరోసారి వైరస్ విజృభిస్తుందనేది శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. శ్వాసవ్యవస్థపై దాడిచేసే వైరస్ నుంచి పూర్తిస్థాయి, శాశ్వత రక్షణ పొందడం అనేది అరుదని రోటర్‌డాంలోని ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వైరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ మారియోన్ కూప్‌మన్స్ చెప్పారు.

ఒకసారి వైరస్‌కు గురైనవారిలో రెండోసారి ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుందని మాత్రం ఆశించవచ్చని ఆమె తెలిపారు. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుత, ఇదివరకటి వైరస్ ధోరణులను బట్టి వేసిన అంచనాలు మాత్రమేననేది గుర్తుంచుకోవాలని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌస్ అన్నారు.