స్థానిక ఎన్నికల ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్
పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలనడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ పేర్కొన్నారు. చాలా రాద్ధాంతాల మధ్య ఎట్టకేలకు పంచాయితీ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికలను ఆహ్వానిస్తోందన్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంత్రులకు ఏకగ్రీవాలు చేయాలని బాధ్యతలు ఇవ్వడాన్ని తొలి సారిగా చూస్తున్నాం.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా,ఇవి రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అని చెప్పారు.
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రజల ముందు ఉన్నాయని.. వీటిని రైతులంతా వ్యతిరేకిస్తున్నారని శైలజనాధ్ చెప్పారు. రైతు చట్టాలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కేంద్రం రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని శైలజనాధ్ డిమాండ్ చేశారు.
వైసీపీ ఆ మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చి ఓట్ వేశారు, రైతులకు ఉరి తాడు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ ఆదానిలకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే బిల్లులని మండిపడ్డారు. అనంతపురంలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుందన్నారు.
12 వందల అడుగుల లోతు వెళ్లిన నీళ్లు రావట్లేదని శైలజనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో నీళ్ల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దుర్మార్గపు చట్టాలకు మద్దతు ఇచ్చిన సీఎం జగన్మోహనరెడ్డిని స్థానిక ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.విద్యుత్ సంస్కరణల ద్వారా మోటార్లకు మీటర్లు పెడతామని జగన్మోన్ రెడ్డి చెప్పారన్నారు.
ఇది రైతులను భయభ్రాంతులకు గురి చేసే అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున వైసీపీ అభ్యర్థులు గెలిస్తే , మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నట్టే అని మీటర్లు పెడతారని.. వారిని ఓడించాలని ప్రజలకు శైలజనాధ్ సూచించారు. రాష్ట్రం స్థానం లేని మతతత్వ పార్టీ, వారి స్నేహితులు, మతాల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే మతతత్వ పార్టీని ప్రజలు రాష్ట్రంలో తిప్పి కొట్టారు, ఈ ఎన్నికల్లో కూడా తిప్పికొట్టాలన్నారు. రాబోయే రోజుల్లో చాలా సమస్యలు రానున్నాయి, ఆలోచించి మంచివారికి ఓట్ వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, నామినేషన్లు వేస్తున్నారని శైలజనాధ్ తెలిపారు.