శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (16:41 IST)

పోలీసుల విచారణకు డుమ్మ కొడుతున్న జోగి రమేష్.. అరెస్టు తప్పదా?

jogi ramesh
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఆయన హాజరుకాలేదు. దీంతో మరోమారు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులను పట్టించుకోకుండా ఆయన విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్టు తప్పదంటూ ప్రచారం సాగుతుంది. 
 
గత వైకాపా ప్రభుత్వంలో విజయవాడ, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై అపుడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ భారీ సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని వెళ్ళి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైకాపా అధికారంలో ఉండగా ఈ కేసు మరుగున పడిపోయింది. ఇపుడు టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఆ కేసును పోలీసులు తిరగదోడారు. ఈ కేసులో ఒకసారి విచారణకు హాజరైన ఆయన.. మంగళవారం విచారణకు హాజరుకాలేదు. దీంతో బుధవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మరోమారు నోటీసులు జారీచేశారు. 
 
కాగా, గత శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరైన జోగి రమేశ్ వద్ద పోలీసులు కొన్ని గంటల పాటు విచారణ జరిపి, పంపించి వేశారు. మంగళవారం విచారణకు హాజరుకావాల్సివుండగా ఆయన డుమ్మా కొట్టారు. తన తరపున లాయర్లు లేకపోవడంతో హాజరుకాలేకపోతున్నట్టు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జోగి రేమేష్ కుమారుడు జోగి రాహుల్... ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములను చట్ట వ్యతిరేకంగా కొనుగులో చేసిన కేసులో అరెస్టయి ఉన్న విషయం తెల్సిందే.