సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (08:46 IST)

పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!

appolice
ఓ ఎస్ఐ పోస్టల్ బ్యాలెట్‌ను అమ్ముకున్నారు. కేవలం 5 వేల రూపాయలకు ఆశపడి ఇపుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. బంధువుల ద్వారా ఓ నాయకుడి నుంచి ఆ ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు. సదరు నాయకుడు పోలీసులకు పట్టుబడటంతో ఈ బండారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా, మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే, ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు డబ్బులు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఆ ఎస్ఐకు ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. 
 
మరోవైపు, ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా ఏఎస్ఐకు కూడా డబ్బులు ఇచ్చినట్టు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింద. దీంతో ఎస్‌ఐపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యల కింద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠికి నివేదిక పంపారు. దీంతో ఖజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.