శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (18:02 IST)

ఏలూరులో అలజడి.. ఆస్పత్రికి సీఎం జగన్.. బాధితుల పరామర్శ

ఫోటో కర్టెసీ-యుఎన్ఐ
వైద్యులకే అంతుచిక్కని వ్యాధితో ఏలూరు పట్టణంలో అలజడి చెలరేగింది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం ఉదయానికి ఈ సంఖ్య 354కు చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారులంతా ఏలూరులోనే ఉన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఏలూరు పర్యటనకు వెళ్లారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. 
 
బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345కు చేరుకుంది.
 
ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ, ఆదివారం రాత్రి వరకు ఏలూరులో 227 మందికిపై అస్వస్థతకు గురయ్యారని, మూర్ఛ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారని తెలిపారు.
బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారని ఆయన వివరించారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరి వైద్యం తీసుకుంటున్నారని చెప్పారు. 70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
 
సమస్య ఉన్న ప్రాంతాల్లో మెరుగైన వైద్య క్యాంప్‌లు పెట్టామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారి పరిస్థితి కాస్త విషమంగా ఉంటే వారిని విజయవాడకు తరలించామని తెలిపారు. 
నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదని, బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదని తెలిపారు. కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ప్రజలకు వస్తోన్న వ్యాధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు. బాధితులకు బాసటగా ఉంటామని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.