శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (17:25 IST)

పంచాయతీ పోరు నిర్ణయంపై స్టే ఇవ్వలేం : ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వలేమని తేల్చి చెపుతూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. 
 
అపుడు ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం అతిక్రమించిందని ఆరోపించారు. 
 
ఈ వాదనలను ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్విని కుమార్ తోసిపుచ్చారు. ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 
 
సుప్రీంకు వెళితే తమ తప్పిదాలు బయటపడతాయనే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల నిర్ణయం ఏకపక్షం కాదని, ఇప్పటికే ఎన్నికల సంఘం మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని స్పష్టం చేశారు.
 
దీంతో ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అడిగారు. ఈ నేపథ్యంలో, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని, ప్రభుత్వ న్యాయవాది మరో అవకాశం అడిగినందున తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నామని పేర్కొంది.