క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా..? అనంతలో కలకలం
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏపీలో మదనపల్లె తరహాలో అనంతపురంలో నరబలి ఇచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బమ్మనహాల్ మండలం హెచ్‌ఎల్‌సి కాలువ వద్ద బుధవారం ఓ యువకుడిని క్షుద్రపూజలు చేసి హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఉంతకల్లు గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలువ గట్టుపై గుర్తు తెలియని 24 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు.
ఎస్‌ఐ బాషా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు మృతి చెందిన ప్రాంతంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో వేసిన ముగ్గు, ఆకులు తదితర వాటిని గుర్తించారు. క్షుద్రపూజల అనంతరం యువకుడిని నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి బళ్లారి ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.
హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. క్షుద్రపూజల కోసమే యువకుడిని హత్య చేశారా..? లేక ఇతర కారణాలతో చంపి అనుమానం రాకుండా నిందితులు ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.