దిశ ఘటనలా స్నేహలత హత్య.. పొట్ట కింద భాగంలో నిప్పంటించారు..
స్నేహలత దారుణహత్య అచ్చం దిశ ఘటననే గుర్తుకు తెస్తోంది. అనంతపురంలో చోటుచేసుకుంటున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, స్నేహలత డ్యూటీ ముగించుకుని వస్తుండగా ఆమెను అత్యంత దారుణంగా హతమార్చారు. దుండగులు. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న స్నేహలతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత పొట్ట కింద భాగంలో నిప్పు అంటించారు. దీంతో స్నేహలత శరీర భాగం కొంత కాలింది. యువతిని చంపి, నిప్పు అంటించడం చూస్తుంటే దిశ ఘటనను తలపిస్తోంది.
అనంతపురంలోని అశోక్‌నగర్‌లో ఉంటున్న స్నేహలత పది రోజుల కిందటే ఉద్యోగంలో చేరింది. హాకీ క్రీడాకారిణి అయిన స్నేహలతను కొంతకాలంగా రాజేశ్ వేధిస్తుండడంతో ప్రాక్టీస్ వదిలిపెట్టి ధర్మవరంలోని ఎస్‌బీఐలో ఉద్యోగంలో చేరింది. ప్రతి రోజు లాగే మంగళవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని బయటకొచ్చింది. ఆరున్నరకు తండ్రికి ఫోన్ చేసి గంటలో ఇంటికి వస్తానని చెప్పింది. ఏడున్నర అయినా రాకపోవడంతో స్నేహలతకు తండ్రి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడం, స్నేహలత ఇంటికి రాకపోవటంతో విషయం తన భార్యకు చెప్పారు.
రాజేశ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు మొదట అతనినే అనుమానించారు. రాత్రి 9 గంటల సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి తన కూతురిని ఏం చేశావో చెప్పమంటూ నిలదీశారు. తనకు తెలియదని రాజేశ్ సమాధానం ఇవ్వడంతో రాత్రి తొమ్మిదిన్నరకు అనంతపురం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా సరిగా స్పందిచలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్న రాజేశ్ అనే యువకుడే స్నేహలతను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
గత నెల రోజుల వ్యవధిలో నిందితుడు రాజేశ్, స్నేహలత మధ్య 1600 కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు నడిచాయని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన రోజు కూడా దాదాపు 16 కాల్స్ ఉన్నట్లు చెబుతున్నారు. స్నేహలత తనను దూరం పెట్టి మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతోనే కక్ష పెంచుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.