గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (19:07 IST)

పశ్చిమగోదావరిలో రెండు తలల వింత పాము.. ధర కోట్లలో ఉంటుందట!

ఏపీలో రెండు తలల పాము కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో ఈ వింత పామును చూసి రైతులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం మండలం, కడియద్ద గ్రామంలో రైతులు పొలం పనులకు వెళ్లగా.. గ్రామంలోని ఆంబోతు దిబ్బ వద్ద రెండు తలల పాము కనిపించింది. వెంటనే పామును పట్టుకున్న రైతులు గ్రామంలోకి తీసుకొచ్చారు. పాము వింతగా ఉండటంతో దానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. 
 
రెండు తలల పాముపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇది చాలా అరుదైన జాతికి చెందిన పాము అని అటవీ శాఖాధికారులు తెలిపారు.ఈ పాము అత్యంత అరుదైన 'రెడ్‌ సాండ్‌ బో' జాతికి చెందిన పాము అని స్థానికంగా దీనిని రెండు తలల పాముగా పిలుస్తారని పేర్కొన్నారు. 
 
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పొదలు నేలమట్టమయ్యాయి. దీంతో పొదల్లో దాగివున్న రకరకాల పాములు నివాసయోగ్యమైన స్థలం వెతుక్కుంటూ ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల అనేక రకాల పాములను గ్రామస్తులు చంపేస్తున్నారు. ఇటువంటి అరుదైన సర్ప జాతి కనిపించినప్పుడు జంతు సంరక్షణ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
 
అయితే ఇలాంటి పాములు స్మగ్లర్లకు కాసులు కురిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులను నమ్మించి ఈ పాములను లక్షలు, కోట్లకు బేరాలు పెడతారు. ఇలాంటి ముఠాలు పోలీసులకు చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పాము ధర కోట్లలో ఉంటుందట. ఇది ఆరు నెలలు ముందుకు, ఆరు నెలలు వెనక్కు పాకుతుందని చెబుతున్నారు.