అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ తాజా సినిమా కింగ్ డమ్. ఈ సినిమా అన్నిచోట్ల మంచి రన్నింగ్ లో వుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గురించి వివరాలు తెలియజేశారు. సినీ పరిశ్రమలో సుకుమార్ తో తనకు చాలా అనుబంధం వుందన్నారు. కింగ్ డమ్ సినిమా చూశాక మొదటిగా ఫోన్ చేసింది సుకుమారేనని తెలిపారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
అలాగే సుకుమార్ గారితో సినిమా తప్పకుండా చేస్తా. గతంలోనే మిస్ అయింది. అర్జున్ రెడ్డి సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది.
అయితే, ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల దర్శకులు. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు అని తెలిపారు.