గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (10:08 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పల్లె పండుగ (Video)

palle panduga
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పల్లెపండుగ ప్రారంభంకానుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలను సోమవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ.,4,500 కోట్ల నిధులతో 30 వేలకు పైగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. 
 
గ్రామాల్లో "గ్రామీణ ఉపాధి హామీ పథకం" కింద చేపట్టే పనులను "పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు" పేరిట సోమవారం ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించగా, వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు కూడా దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 30 వేల ప‌నుల‌ు చేపట్టాల్సి ఉంది.
 
పల్లె పండుగ కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో 'పల్లెపండుగ - పంచాయతీ వారోత్సవాల్లో' భాగంగా అన్ని రకాల పనులకు భూమిపూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. 
 
ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ మాట్లాడుతూ, "ప్రతి గ్రామంలో సర్పంచ్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనులకు సంబంధించిన భూమి పూజ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలలో అవగాహన కల్పించడం. గ్రామంలో ఏ పనులు జరుగుతున్నాయో తెలిస్తేనే ప్రజలు వాటి పైన దృష్టి పెడతారు. తద్వారా పారదర్శకత వస్తుంది. ప్రతి చోట సిటిజెన్ నాలెడ్జ్ బోర్డులను పెడుతున్నాము" అని వివరించారు.