ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (12:08 IST)

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీకి భారీ వర్ష సూచన

low pressure
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఉపరితల ఆవర్తనం ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది. 
 
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
 
వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాగానికి ఆమె సూచించారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
 
ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లా కలెక్టర్ లు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు పొంగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. 
 
రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 1800 425-001ను సంప్రదించాలని సూచించారు.