నిధి అగర్వాల్‌ను అసభ్యంగా తాకిన పోకిరీలు
హైదరాబాద్ నగరంలో హీరోయిన్ నిధి అగర్వాల పట్ల పలువురు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను అసభ్యంగా తాకారు. మరికొందరు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై వాయిస్ ఆఫ్ ఉమెన్ తీవ్రంగా స్పందించింది.
ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన నిధి అగర్వాల పట్ల అసభ్యంగా తాకడం క్షమించరాని నేరమని పేర్కొంది. మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళల భద్రత, గౌరవానికి భగం కలిగినపుడు నిశ్చబ్దంగా ఉంటే ఎలా అంటూ ప్రశ్నించింది.
అలాగే, మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ ఘాటుగా స్పందించింది. శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీల వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం దారుణమని తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలకుగాను శివాజీ తక్షణం బహిరంగ, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని వాయిస్ ఆఫ్ ఉమెన్ డిమాండ్ చేసింది. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు చిత్ర పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం ఏమాత్రం భావ్యం కాదని పేర్కొంది.
శివాజీ తన ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితం మాత్రమే కాదని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడే సమయంలోచాలా జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించింది.