గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:36 IST)

విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు ఫైర్..

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ధన దాహానికి ఓ విద్యార్థిని బలైంది. కాలేజీ ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బిటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
 
గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ఏడాది ఫీజు రీయంబర్స్ మెంట్ రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తాళలేక తేజశ్రీ తల్లి విజయ కుమారి అప్పులు చేసి నిన్న ఫీజులో కొంత భాగం చెల్లించింది. ఇదే విషయం నిన్న రాత్రి ఇంట్లో చర్చకు వచ్చింది.
 
ఒక వైపు ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి, మరో వైపు తల్లి ఆర్థిక ఇబ్బందులు చూసి తట్టుకోలేక తేజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి చేసిన కాలేజీ యాజమాన్యంపై చంద్రబాబు మండిపడ్డారు.