సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (08:56 IST)

ఆంధ్రా ప్రజల్లో అలజడి రేపిన కొత్త జిల్లాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అలజడి చెలరేగింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థరాత్రి జీవోలు జారీచేసింది. పైగా, కొత్త జిల్లాలు, వాటి రాజధానుల(హెడ్ క్వార్టర్) పేర్లను కూడా ప్రకటించింది. ఇక్కడే అనేక జిల్లాలకు చెందిన ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. నిరసన ర్యాలీలు, ఆందోళనకు దిగారు. మరోవైపు, పీఆర్సీ సాధన కమిటి పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనులు చేస్తున్నారు. వెరసి ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటు చూసినా ఆందోళనలే జరుగుతున్నాయి. 
 
ఇదిలావుంటే, అన్నమయ్య జిల్లాను ఆయన జన్మించిన రాజంపేటను కాదని రాయచోటిని ప్రకటించడంపై వైకాపా నేత రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి అలక బూనారు. ప్రజల మనోభావాలను, నాయకుల అభిప్రాయులను తెలుసుకోకుండా జిల్లాలు ప్రకటించారని, వైకాపా నేతలను ప్రజలు ఈ ప్రాంతంలో తిరగనివ్వరని అన్నారు.
 
రాజంపేట రైల్వే కోడూరులో వైకాపా ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా, అవసరమైతే మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ఆయన బోరున విలపిస్తూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. పైగా, ఈ వీడియో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరేంత వరకు షేర్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 
 
అన్నమయ్య పుట్టిన గడ్డను కాకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని ఆయన పేరున జిల్లా చేశారని, ఇది తమను అవమానించేలా ఉందని అన్నారు. తనను కడపలో కలిపేసినా మర్యాదగా ఉండేవాడినని, కానీ, అనాథ బిడ్డాల్లా రాయచోటిలో కలపడం ఏంటని, ఎవరిని అడిగి చేశారంటూ ఆయన నిలదీశారు.