శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 11 మే 2016 (12:04 IST)

రూ.కోట్లకు పడగలెత్తిన ఎర్రచందన మహా కి'లేడి'...

ఈ ఫోటోలో అందంగా కనిపిస్తున్న ఈమె పేరు సంగీతా ఛటర్జీ. ఈమె కనిపిస్తున్నంత మృదు స్వభావురాలైతే ఎంతమాత్రం కాదు. రెడ్‌ స్మగ్లర్‌ డాన్‌. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనాన్ని విక్రయించే కిలాడి. శేషాచలం అడవుల్లో లభించే అరుదైన వృక్ష సంపదను కొంత మంది అక్రమార్కులు బయటి రాష్ట్రాలకు తరలిస్తే వాటిని విదేశాలకు తరలించి కోట్లకు పడగలెత్తిన మహా లేడి.
 
ప్రియుడు లక్ష్మణతో కలిసి ఎర్ర వ్యాపారాన్ని యధేచ్ఛగా చేసింది సంగీతా ఛటర్జీ. ఇంకేముంది కోల్‌కతా స్థావరంగా జరిగిన ఈ తతంగమంతా పోలీసులకు తెలిసిపోయింది. ఈ మధ్య కాలంలో పోలీసుల తనిఖీలలో లక్ష్మణ్‌ పట్టుబడ్డాడు. విచారణతో ఎన్నో విషయాలను చెప్పేవాడు లక్ష్మణ్‌. అంతే ఇక కిలాడి వేట కోసం పరుగులు తీశారు చిత్తూరు జిల్లా పోలీసులు. రెండు రోజులుగా ఆమె కోసం కోల్‌‌కతాలో వెతికారు. మొత్తం మీద ఆమె కనిపించిందని తెలియడంతో అక్కడకు పరుగులు తీశారు. ఇంకేముందు అందరూ అరెస్టు అని అనుకున్నారు. ఇంతలోనే 20 మంది న్యాయవాదులు ఒక్కసారిగా పోలీసులను చుట్టుముట్టి బెయిలంటూ చూపించడం మొదలెట్టారు. అంతమంది న్యాయవాదులను చూసి చిత్తూరు జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎర్ర డాన్‌‌ను అక్కడే వదిలి తిరుగుపయనమయ్యారు. 
 
అయితే సంగీతాను ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌ పోలీసులను ఆదేశించారు. త్వరలో రెడ్‌ కిలాడిని చిత్తూరు కోర్టుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిత్తూరులోనే కేసు నమోదు చేయడంతో ఖచ్చితంగా రెడ్‌ కిలాడి ఇక్కడకు రావాల్సి ఉంటుంది.