#JSPForAP_Roads.. అడుగుకో గుంత… గజానికో గొయ్యి.. పవన్
ఏపీలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత… గజానికో గొయ్యి అన్న విధంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు చేస్తున్నారని మండి పడ్డారు. పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దామని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దామని అన్నారు. ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా ఉందన్నారు.
ఇవి సరదాకు చేస్తున్న రాజకీయ విమర్శలు కాదని… నివార్ తుఫాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశానని అన్నారు. రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.