శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (03:32 IST)

మా పని అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే.. డీలా పడ్డ టీడీపీ మంత్రులు, ఎంఎల్ఏలు

ఒక్కరోజు వ్యవధిలో ఎంత తేడా.. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా కంచుకోటను బద్దలు కొట్టిన టీడీపీ 24 గంటల తర్వాత కౌంటింగ్ మొదలైన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం పొంది మంత్రులు, ఎమ్మెల్యేలనే బిత్తరపోయేలా చేసింది.

ఒక్కరోజు వ్యవధిలో ఎంత తేడా.. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా కంచుకోటను బద్దలు కొట్టిన టీడీపీ 24 గంటల తర్వాత కౌంటింగ్ మొదలైన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం పొంది మంత్రులు, ఎమ్మెల్యేలనే బిత్తరపోయేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో పోటీ జరిగిన అయిదు స్థానాలకు గాను నాలుగింటిలో ఓడిపోవడంతో అధికారపక్షం తలలు వేలాడేసింది.

పైగా చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీ కుప్పకూలడం పార్టీని నివ్వెరపర్చింది. పరోక్ష ఎన్నికల్లో సత్తా చూపిన ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో ఎన్నికలు జరగని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నాలు చేబడుతున్నట్లు సమాచారం. 
 
రాష్ట్రం లోని 9 జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా కుప్పకూలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ గెలుపు తథ్యం అని నమ్మిన అదికార పార్టీకి పలితాలు  శరాఘాతంలా తగిలాయి. 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారంటే టీడీపీ ఎంత షాక్‌కు గురయిందో బోధవడుతుంది.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయం వరకు సభలోకి రాకుండా తన గదికే పరిమితమైపోగా, అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగోలా మేనేజ్ చేసి గెలిచినప్పటికీ, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్నారు. 
 
మా పని అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలు తప్పవు. ఇది గమనించే మా అధినేత ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను కూడా ఏదో ఒక సాకు చూపించి, నిలిపివేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రి ఒకరు విశ్లేషించారు.
 
మొత్తం మీద ఒక విషయం తేలిపోయింది. ఫలితాలను పక్కనబెట్టి చూస్తే అధికార పార్టీ మధ్యతరగతి వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిందని తేలిపోయింది. పాలనను పూర్తిగా మార్చుకోకపోతే తప్ప టీడీపీకి భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని రాజకీయ పరిశీలకులు స్ఫష్టం చేస్తున్నారు.