సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:25 IST)

ఏపీలో భూ కేటాయింపులు... కిమ్స్‌కు 40, పుల్లెల అకాడమీకి 12 ఎకరాలు... ఇంకా....

అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు, ధరలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం ప్రతిపాదించింది. సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక మంత్రి చాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో మానవవనరుల అభివృద్ధి

అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు, ధరలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం ప్రతిపాదించింది. సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక మంత్రి చాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ వి. రామమోహన రావు తదితరులు పాల్గొని పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, కార్పోరేషన్లకు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు, విద్య, వైద్య సంస్థలకు, ప్రైవేటు వాణిజ్య సంస్థలకు, హోటళ్లకు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద  సంస్థలకు కేటాయించవలసిన భూములు, వాటి ధరల గురించి చర్చించారు. ఇప్పటివరకు 29 సంస్థలకు దాదాపు వెయ్యి ఎకరాల వరకు భూములు కేటాయించాలని నిర్ణయించినట్లు, వాటిలో కొన్ని సంస్థలకు భూములు అప్పగించినట్లు, అక్కడ నిర్మాణాలు కూడా మొదలైనట్లు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎం, విట్ విశ్వవిద్యాలయాల భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు, వీటిలో తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమృత విశ్వవిద్యాలయం 2018-19 సంవత్సరం నుంచి తరగతులు ప్రారభిస్తుందన్నారు. నిట్ భవనాల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నట్లు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు అందరికీ ప్లాట్లు ఇచ్చినట్లు, రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. 
 
ఇండో-యూకే వైద్యశాల(150 ఎకరాలు), బీఆర్ శెట్టి మెడికల్ కాలేజీ(వంద ఎకరాలు), నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్, కేంద్రీయ విద్యాలయం, రిజర్వు బ్యాంకు(11 ఎకరాలు), నాబార్డ్(4.3 ఎకరాలు), ఆప్ కాబ్, ఎస్ బిఐ, ఆంధ్రాబ్యాంక్, సిండికెట్ బ్యాంక్ తోపాటు మరికొన్ని బ్యాంకులకు, ఎల్ఐసీ, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ(15 ఎకరాలు),  కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (17 ఎకరాలు), రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్(ఒక ఎకరం) కేటాయించారు. 
 
ఇంకా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హెచ్ పీసిఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్, ఏపీఎన్ఆర్టీ(4.5 ఎకరాలు) వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సృతివనం(20 ఎకరాలు), స్టేట్ ఫోరెన్సిక్ లేబరేటరీ(3 ఎకరాలు), ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(12.5 ఎకరాలు), కిమ్స్ వైద్యవిద్యాలయం, ఆస్పత్రి(40 ఎకరాలు), క్సేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ (30 ఎకరాలు), పుల్లెల గోపిచంద్ అకాడమీ(12 ఎకరాలు)కి భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆయా సంస్థలు అడిగినంత భూమిని కాకుండా అందుబాటులో ఉన్న భూమిని ఆయా సంస్థల అవసరాల మేరకు కేటాయించారు. 
 
రిజర్వు బ్యాంకు, నేవీ వంటి కొన్ని సంస్థలకు వాటికి కార్యాలయాలతోపాటు ఉద్యోగుల నివాస భవనాల కోసం కూడా వేరువేరు చోట్ల ఇచ్చేవిధంగా భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. వీటిలో కొన్ని సంస్థలకు భూములను అప్పగించారు. నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. సంస్థల ప్రాతిపదికగా వాటికి ఇచ్చే భూముల ధరలు నిర్ణయించారు. విద్య, వైద్య సంస్థలు ఒక కేటగిరీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, హోటళ్ల వంటి వ్యాపార సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్లను వేరు వేరు కేటగిరీలుగా విభజించారు. ఎకరం  కనీస ధర రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు. డబ్బు చెల్లించిన తరువాతే భూములు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదించవలసి ఉంటుంది.