శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 27 జూన్ 2025 (15:43 IST)

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - నేను నాదైన ప్రపంచంలో బతుకుతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. విశాఖలో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ అధికారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా బైట్ ఇవ్వమని చెప్పారు. ఆ క్యాంపెయిన్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసి ఆశ్చర్యపోయా. కొందరు పోలీస్ అధికారులను అడిగితే వివరాలు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకున్న ఈ వ్యసనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి అనిపించింది. అందుకే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. 
 
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడి యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు. మన దేశంలో యువశక్తి ఎక్కువ. అందుకే కొన్ని దేశాలు మన యువతకు మత్తుపదార్థాలు అలవాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. డ్రగ్స్ కు అలవాటు పడితే కోలుకోవడం కష్టం. మీ స్నేహితులు ఎవరికైనా మత్తు అలవాటు ఉంటే వారికి దూరంగా ఉండండి.  మనకు జీవితంలో ఆరోగ్యం, డబ్బు, గౌరవం కావాలి. ఈ మూడు ఇవ్వలేని పనులు చేసి ఉపయోగం లేదు. మీ తల్లిదండ్రులకు గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలి. అన్నారు.