నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ఈ జిల్లాల్లో రేపు ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపారు.
ఆదివారం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్జీఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. తుఫాను ముప్పు దృష్ట్యా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్పుడప్పుడు వాటి వేగం 80 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో రెండో నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు.
తుఫాను హెచ్చరికలతో రాష్ట్ర హోంమంత్రి వి.అనిత అధికారులను అప్రమత్తం చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. మరో మూడు బృందాలను సిద్ధంగా ఉంచింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.