శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (17:14 IST)

ముగిసిన తెలంగాణా చిన్నమ్మ అంత్యక్రియలు .. కన్నీరు కార్చిన వెంకయ్య

బీజేపీ సీనియర్ మహిళా నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన సుష్మాకు ఆమె అభిమానులు, బీజేపీ శ్రేణులు, నేతలు కన్నీటి వీడ్కోలికారు. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో నిర్వహించారు. 
 
అంతకుముందు, సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించిన అనంతరం, బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశాన వాటిక వరకు ఆమె అంతిమ యాత్ర నిర్వహించారు.
 
సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అభిమానులు పాల్గొన్నారు.
 
అంతకుముందు సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. ఆమెకు అంజలి ఘటించే సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. ఫలింతగా ఆయన ఉగ్గపట్టుకుని ఏడ్చారు. అలాగే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని చూసి కన్నీరుకార్చారు.