ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (09:31 IST)

కరోనా ఎఫెక్టు : షూటింగ్స్ నిల్ - రియల్ ఎస్టేట్ ఢమాల్.. బుల్లితెర నటి సూసైడ్

కరోనా కష్టాలను భరించలేక మరో వర్ధమాన బుల్లితెర నటి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు మద్దెల సబీరా అలియాస్ రేఖ (42). ఒకవైపు కరోనా కష్టాలను అధికమించలేకు, మరోవైపు సీరియల్ షూటింగులన్నీ బంద్ కావడం, ఇంకోవైపు నమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టాల ఊబిలో కూరుకుని పోవడంతో ఆమె ఈ విషాదకర నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన రేఖ నటనపై అభిమానంతో హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించింది. అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. 
 
ప్రస్తుతం వీరు విద్యానగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు. గత రెండేళ్లుగా అది కూడా మానేశారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. చుట్టుముట్టిన కష్టాలతో కలత చెందిన ఆమె బుధవారం స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు.
 
స్నానానికి వెళ్లిన భార్య ఎంతకీ బయటకు రాకపోవడంతో తలపులు పగలగొట్టి చూసిన చైతన్య విస్తుపోయాడు. భార్య ఉరి వేసుకోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.